Site icon NTV Telugu

Chandrababu: దేవుడు స్క్రిప్ట్‌ తిరిగి రాశాడు.. ఇక అన్‌స్టాపబుల్..

Chandrababu

Chandrababu

Chandrababu: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే కోటాలోని ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుకున్ని టీడీపీలో కొత్త జోష్‌ వచ్చింది.. మంగళగిరిలో టీడీపీ జోన్ – 3 సమావేశంలో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మ తిరిగింది.. ఆ దెబ్బ నుంచి కోలుకోక ముందే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ కొట్టాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వారు మాకు ఓట్లేయరని ఆ పార్టీ నేతలే చెప్పేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ మీద నమ్మకం లేదన్న ఆయన.. 23 సీట్లు అంటూ అవహేళన చేశారు. భగవంతుడు అదే స్క్ర్రిప్ట్ తిరిగి రాశాడు. ఇక మీదట టీడీపీ అన్ స్టాపబుల్.. గేరు మారుస్తాం.. స్పీడు పెంచింది.. సైకిల్ దూసుకెళ్తుంది.. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్తాం అన్నారు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా అనురాధ గెలిచింది.. నాగరిక సమాజంలో ఆడబిడ్డలను ఎవ్వరూ వేధించరు.. కానీ, అనురాధను వైసీపీ నేతలు వేధించారని మండిపడ్డారు చంద్రబాబు. తెలుగుదేశం మరిన్ని విజయాలు సాధించాలి.. దాని సైన్యం కావాలి. ఆ సైన్యం కార్యకర్తలే అన్నారు. జగన్ చేసిన విధ్వంసం వల్ల 30 ఏళ్లు వెనక్కు వెళ్లాం. అప్పులు చేయడం.. రాష్ట్రాన్ని దోచుకోవడం.. ఇదే జగన్ పని అని ఆరోపించారు.. ప్రజావేదికను కూలగొట్టిన రోజే జగన్ వైఖరేంటో అర్థమైంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని.. జగన్ చేసిన అవమానాలను ఏపీ ప్రజలు భరిస్తున్నారన్నారు.. మా తిక్కల ముఖ్యమంత్రి రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం ఆగిపోయింది.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అయితే.. బ్యారేజ్ కడతానని అంటున్నారు.. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ తరహాలో పోలవరం రూపంలో బ్యారేజ్ కడతారా..? అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ సామర్ధ్యం తెలుసు కాబట్టే పోలవరం నిర్మాణ బాధ్యతలను నీతిఆయోగ్ మన ప్రభుత్వానికి అప్పజెప్పింది అన్నారు.. టీడీపీ కంటిన్యూ అయ్యింటే ఈపాటికే పోలవరం నిర్మాణం పూర్తి అయ్యేదన్నారు.. వైసీపీ విషయంలో ఇప్పటి నుంచి మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెడుతుంది.. ఎదుర్కోవాలన్నారు.. జగన్‌ది ధనబలం.. టీడీపీది జనబలం అన్నారు.. కానీ, జనబలం ముందు ధనబలం ఆగలేదన్నారు.. పేదలను దోచుకున్న జగన్.. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. దేశంలోని అందరి ముఖ్యమంత్రులకున్న ఆస్తి కంటే జగన్ ఆస్తి ఎక్కువ అని.. ఇంతటి ఆస్తి ఉన్న జగన్ పేదల ప్రతినిధా..? అని ప్రశ్నించారు.. ప్రతి ఇంటికి వెళ్లి.. జగన్ చేసే మోసాన్ని వివరించాలి.. సంక్షేమం చేసింది మనమే.. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చింది.. దాని ఫలితమే.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ప్రజల తీర్పు వచ్చింది. ఇక్కడ కూడా ఎన్నికల ఏకపక్షమే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు చంద్రబాబు.. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుందన్న ఆయన.. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు ఉండవు.. కష్టపడిన కార్యకర్తలను ఎమ్మెల్యేలు గుర్తించకున్నా.. పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం పని చేసే వారే నా ఆప్తులు.. వారికే ప్రాధాన్యత. రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో.. టీడీపీ కుటుంబ సభ్యులను కూడా బాగుచేయడం అంతే ముఖ్యం అన్నారు. అధికారం వస్తే.. మమ్మల్ని పట్టించుకోరనే అనుమానం కొందరిలో ఉంది. గతంలో నేను కార్యకర్తలను ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి.. అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయాన్నారు. కానీ, ఈసారి కార్యకర్తలకే పెద్ద పీట వేస్తాం.. ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యం అన్నారు చంద్రబాబు.

Exit mobile version