యువకులు వినూత్నంగా ఆలోచిస్తున్న రోజులివి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ కుటుంబానికి, సమాజానికి ఏదో చేయాలని సంకల్పంతో ముందుకెళుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో వాగులు ఎక్కువగా వుంటాయి. వాటిని దాటటం చాలా కష్టం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. ఎన్నికల వేళ అధికారులు, వివిధ పార్టీల నేతలు వచ్చి ఓట్లడిగి, తీరా ఎన్నికలయ్యాక వారి గోడును పట్టించుకోలేదు. మహారాష్ట్ర లో యువకులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది.
తమ ప్రయాణ కష్టాలను అధిగమించడానికి వారంతా నడుం బిగించారు.. చేయి చేయి కలిపారు. వారు తయారుచేసిన కర్రల వంతెన అందరినీ ఆకట్టుకుంటోంది. అసలే అటవీ ప్రాంతం వాగుపై కట్టిన కర్రల వంతెన కలర్ ఫుల్ గా వుంది. గడ్చి రోలి జిల్లా భామ్రాగర్ లోని గుండెనూర్ లో వాగుపై వంతెన ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాకపోకల కోసం ప్రతి సంవత్సరం ఇలా వంతెనలు ఏర్పాటు చేసుకుంటున్నారు స్ధానికులు. వాగులో పిల్లర్ల కోసం వెదురు, బ్రిడ్జి కోసం కలప వినియోగించారు యువకులు. బాగా గట్టిగా వుండేలా ఏర్పాటుచేసుకుంటున్న వంతెన మీద నుంచి ద్విచక్రవాహనాలు, సైకిళ్లు వాడుతున్నారు. అయితే, ఇలాంటి వంతెనలపై భారీ వాహనాలకు అవకాశం వుండదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలంటున్నారు. ఈ వంతెనతో తమ కష్టాలు తీరాయంటున్నారు. చూశారా.. అధికారులు వచ్చి ఏదో చేస్తారని కాకుండా తమ శ్రమదానంతో తమ ఇబ్బందులకు వారే చెక్ పెట్టుకుంటున్నారు.
ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని గొటివాడ పంచాయతీలోని బోరి, బండిగూడ, బల్లేరు, బోరుగూడ, కిడికేసు, బల్లేరుగూడ, నిడగల్లుగూడ గిరిజనులు ఎటువంటి అవసరాలు ఏర్పడినా బండిగూడ సమీపంలోని గెడ్డ దాటాల్సిందే. భారీ వర్షాలు వస్తే అంతే సంగతులు. ఇక గర్భిణీలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిత్యావసర సరుకుల కోసం ఇటు గొటివాడ, కురుపాం రావాలన్నా స్థానికంగా ఉన్న గెడ్డ దాటాల్సిందే..
అత్యవసర పరిస్థితి ఏర్పడితే జియ్యమ్మవలస మండలం రామభద్రపురం గ్రామం మీదుగా వెళ్తున్నారు. ఏళ్ల తరబడి ఈ గెడ్డపై వంతెన ఏర్పాటు చేయాలని పాలకులకు, అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో బండిగూడ గ్రామస్తులు, యువత స్వచ్ఛందంగా కర్రలతో వంతెనను నిర్మించుకున్నారు. ఈ వంతెన కూడా చూడముచ్చటగా వుంది. కడప జిల్లాలోనూ ఇదే తరహా ఆలోచన చేశారు గ్రామస్తులు. దీంతో అక్కడ విద్యార్ధినీ, విద్యార్ధుల కష్టాలు తీరాయి.
Read Also:Women Toys: రైతు వినూత్న ఆలోచన.. పంటచేనులో బొమ్మలు