Site icon NTV Telugu

Andhra Pradesh Bar Policy: బార్‌ లైసెన్స్‌ల కోసం రేపటి నుంచే బిడ్డింగ్ ప్రక్రియ..

Bar Policy

Bar Policy

ఆంధ్రప్రదేశ్‌ బార్ పాలసీలో భాగంగా రేపట్నుంచి జిల్లాల్లో బార్ లైసెన్సుల కోసం బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్.. జోన్ల వారీగా బార్ లైసెన్సులకు బిడ్డింగ్ నిర్వహించనున్నారు అధికారులు. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఈ నెల 28వ తేదీ సాయంత్రం నాన్ రిఫండ్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గడువు పెట్టారు.. 28, 29వ తేదీల్లో అప్లికేషన్ల స్క్రూట్నీ ఉండనుండగా..ఈ నెల 30, 31 తేదీల్లో ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బిడ్డింగ్ జరగనుంది.

జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఈ నెల 30వ తేదీన బిడ్డింగ్ నిర్వహిస్తారు.. అదే రోజు జోన్-4 పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అనంత, నంద్యాల, కర్నూలు జిల్లాలకూ బిడ్డింగ్ ఉండనుంది.. ఇక, జోన్-2 పరిధిలోని కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఈ నెల 31వ తేదీన బిడ్డింగ్ ఉండనుండగా.. జోన్-3 పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా అదే రోజు నిర్వహించనున్నారు.. మొత్తంగా 30, 31 తేదీల్లో ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బిడ్డింగ్ జరగనుంది.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ-బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు అధికారులు.

కాగా, ఇప్పటికే కొత్త బార్‌ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. కొత్త పాలసీ ప్రకారం బార్లకు లైసెన్స్‌ మూడు సంవత్సరాల పాటు ఇవ్వనున్నారు.. కొత్త పాలసీ 2022 సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమలు కాబోతోంది.. జిల్లాలు పెరిగినప్పటికీ బార్ల సంఖ్య పెంచకూడదని ఆదేశాలు జారీ కాగా.. 840 బార్ల లైసెన్స్‌లు మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈలోగా బార్ల లైసెన్స్‌లు పొందేందుకు వేలం, లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 10 కిలోమీటర్లు, మున్సిపాలిటీలో 3 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా బార్‌ పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. జూన్‌ 27న నిర్దేశిత లైసెన్సు ఫీజులు చెల్లించాలని బార్‌ల యాజమాన్యానికి సూచనలు జారీ చేసింది. మరోవైపు, 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతంలో రూ. 5 లక్షల డిపాజిట్‌, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో రూ.7 లక్షల 50 వేలు, 5 లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 10 లక్షలు అప్లికేషన్‌ ఫీజుగా నిర్ణయించారు.

Exit mobile version