తెలుగు రాష్ట్రాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని అకాల వర్షాలు, వరుస తుఫాన్లు వణికిస్తున్నాయి. మొన్నటికి మొన్న వచ్చిన ‘మురసు’ తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చి పోగా.. దానికి సరిగ్గా రెండు రోజుల ముందే ‘అర్నబ్’ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించి వెళ్లింది. ఇలా రెండు మూడు రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు విరుచుకుపడటమే ఒక అరుదైన రికార్డు అనుకుంటే, ఇప్పుడు వాటన్నింటినీ మించి మరో తుఫాను ముప్పు పొంచి ఉందనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో ‘ఆక్వాన్’ (Aquan) అనే మరో సైక్లోన్ రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికైతే ఉత్తర హిందూ మహాసముద్రంలో గానీ, బంగాళాఖాతంలో గానీ దీనికి సంబంధించిన ఎలాంటి ప్రత్యక్ష కదలికలు మొదలు కాలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నవంబర్ రెండో వారం చివరి నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, అది ఏర్పడిన తర్వాతే తుఫాను తీవ్రత, దిశపై ఒక స్పష్టమైన అప్డేట్ వస్తుందని చెబుతున్నారు. నవంబర్ మూడో వారంలో ఇది పూర్తిస్థాయి సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ రాబోయే సైక్లోన్ అంశంపై భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అలర్ట్ జారీ చేయలేదు.
ఒకవేళ ఈ అల్పపీడనం బలపడి సైక్లోన్‌గా మారితే, దాని తీవ్రత ఎంతవరకు ఉంటుందనేది ఆ సమయానికి తేలనుంది. అంతర్జాతీయ వాతావరణ సంస్థల నిబంధనల ప్రకారం ఈసారి రాబోయే తుఫానుకు పేరు పెట్టే వంతు ఇరాన్‌ది కాగా.. వారు దీనికి ‘ఆక్వాన్’ అని నామకరణం చేశారు. దీనికి ‘స్టార్మ్ డీమన్’ (తుఫాను రక్కసి) అనే భయంకరమైన అర్థం వస్తుంది. వరుస తుఫాన్లతో ఇప్పటికే విలవిలలాడుతున్న రైతులు, తీర ప్రాంత ప్రజలు ఈ వార్తతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

