NTV Telugu Site icon

Ayyanna Patrudu: జగన్ ఒక శాడిస్ట్.. ధర్మాన, బొత్సలకు ఏమైంది?

Ayyanna Patrudu On Jagan

Ayyanna Patrudu On Jagan

Ayyanna Patrudu Fires On AP CM YS Jagan Dharmana Botsa: ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ఓ శాడిస్ట్ అని విమర్శించారు. విశాఖలో ఇప్పుడు ఈ గర్జనలెందుకు? అని నిలదీశారు. జగన్ తప్పు చేస్తోంటే.. ధర్మాన, బొత్స వంటి వాళ్లు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. మిగతా వైసీపీ నేతలకంటే అనుభవం లేదు.. మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ధర్మాస, బొత్సలకు ఏమైంది? అని అడిగారు. ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని అన్నారు. సజ్జల స్క్రిప్ట్ రాసిస్తే.. అదే ధర్మాన, బొత్స మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేయలేదా..? అని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు అని అంటుంటే.. ఇక్కడ ఈ తుగ్లక్ జగన్ మాత్రం మూడు రాజధానులు కావాలంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఆర్ధిక రాజధాని అని చంద్రబాబు ఎప్పుడో చెప్పారన్నారు. విశాఖ భూములని తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 25 వేల కోట్లు ఏమయ్యాయి..? ప్రశ్నించారు. విశాఖలో రామానాయుడు స్టూడియోస్‌ని జగన్ లాగేసుకున్నారని ఆరోపించారు. తమని బెదిరించి మరీ ఆ స్టూడియోస్ రాయించుకున్నారని సురేష్ బాబు చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రామానాయుడు స్టూడియోస్ నుంచి ఋుషికొండకు సొరంగం తవ్వి.. ఆ సొరంగం నుంచి జగన్ దంపతులు వచ్చి బీచ్‌లో విహరిస్తారంటూ ఎద్దేవా చేశారు.

చోడవరం ఎమ్మెల్యేకి పిచ్చి పట్టిందని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరుగుతోంటే, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆగిపోతే.. చోడవరం ఎమ్మెల్యే ఎందుకు రాజీనామా చేయలేదు? అని నిలదీశారు. విశాఖ గర్జన వస్తేనే నీళ్లు ఇస్తామని పంపుల్లో నీటి సరఫరా ఆపేశారని.. బెదిరించి మరీ విశాఖ గర్జనకు జనాన్ని రప్పిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఢయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో తెలియని వాళ్లు మంత్రులయ్యారన్నారు. రైతుల మీద కక్ష ఏంటి? రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే తప్పేంటి? మా దేవుడి దగ్గరకు వస్తారెందుకని రైతులను ప్రశ్నిస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ లాంటి శాడిస్ట్‌ను తాను ఎక్కడ చూడలేదని.. ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేసి కొడుతున్నారని అన్నారు. చివరికి తన మనవరాల్ని బెదిరించారని, ఐదేళ్ల చిన్నపిల్లని బెదిరించడం ఏంటని.. దమ్ముంటే తనని బెదిరించమని సవాల్ విసిరారు.

అరకు కాఫీ తోటల్లో గంజాయి పెంచుతున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేశారు. వైసీపీ ఓడిపోతోందని పీకే చెప్పాడని.. అందుకే జగన్ భయపడుతున్నారని అన్నారు. రాజధాని మార్చే అధికారం రాష్ట్రానికి లేదని.. కావాలంటే రాజ్యాంగం చదువుకోండని అన్నారు. రాజ్యాంగంలో ఏముందో ధర్మానకు.. బొత్సకు తెలీదా? అని నిలదీశఆరు. జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె 500 గజాల భూమి కొంటే కేసు పెట్టారని.. తన కుమార్తె ఎకరాల కొంటుంటే మాత్రం తనకేం సంబంధమని విజయసాయి అంటున్నాడని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అయ్యన్న పాత్రుడు.. ‘అమరావతి ఏపీ ఏకైక రాజధాని, విశాఖ ఆర్ధిక రాజధాని’ అనేదే తమ నినాదమన్నారు.