Site icon NTV Telugu

Araku Mla: చంద్రబాబుపై అరకు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు.. వైరల్

Babu Araku (1)

Babu Araku (1)

ఏపీలో రాజకీయం వేడెక్కుతూనే వుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే హుకుంపేట మండలంలోని తీగలవలసలో పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు ఇళ్లు ఇప్పించాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గిరిజనులకు ఇళ్లు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే, వాటిని ఇవ్వకుండా కోర్టుల్లో కేసులు వేసి చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

అందువల్లే ఇళ్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాదు, ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని వారికి సూచించారు.ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా వుంటే అరకు ఎమ్మెల్యేను వివిధ సమస్యలపై ప్రజలు నిలదీశారు. రహదారులు, మంచినీటి సదుపాయం లేదని, వెంటనే కల్పించాలని కిన్నెరలోవ, గరుడాపల్లి, గుర్రాల తోట, పంతల చింత, తీగల వలస, గాలిపాడుకి చెందిన గిరిజనులు డిమాండ్ చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీ నేతలపై మండిపడుతూనే వున్నారు. అయితే అరకు ఎమ్మెల్యే వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా వున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
Rain Alert: నేడు భారీ వ‌ర్షాలు.. అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

Exit mobile version