ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న టెన్త్ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. మరింత అప్రమత్తం అయ్యింది పాఠశాల విద్యాశాఖ.. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లను నిషేధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్ధులు, ఎగ్జామినర్లు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు వీల్లేదని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్. పరీక్షల విధులతో సంబంధం లేని సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాలకు అనుమతించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని డీఈవోలకు ఆదేశాల జారీ చేశారు.
Read Also: Heat Wave: అలెర్ట్.. రేపు 14 మండలాల్లో తీవ్ర, 102 మండలాల్లో వడగాల్పులు..!
పదో తరగతి ప్రశ్నాపత్రాలు ఎక్కడా లీక్ కాలేదని.. విద్యార్ధులు, తల్లితండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో స్పస్టం చేసింది పాఠశాల విద్యాశాఖ.. నిన్నటి నుంచి మొదలైన పదో తరగతి పరీక్షల్లో ఎక్కడా ప్రశ్నాపత్రం లీక్ కాలేదని వెల్లడించింది.. ఇక, నంద్యాలలో పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత ప్రశ్నాపత్రాన్ని వాట్సప్ లో షేర్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది. కాగా, ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.. ఈ కేసులో దూకుడుగా దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.