AP: పోలవరంలో డీ వాటరింగ్ ప్రారంభం.. 240 మోటార్లు ఏర్పాటు..

Polavaram

Polavaram

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నిలిచిపోయిన నీటిని బయటకు పంపేందుకు (డీ వాటరింగ్) అధికారులు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం ప్రాజెక్ట్ గ్యాప్-1 ప్రాంతంలో రాష్ట్ర జలవనరుల శాఖ , ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు పూర్తి చేసిన అనంతరం డీ వాటరింగ్ ప్రక్రియను విజయవంతంగా ప్రారంభించారు.

ప్రాజెక్టు పరిధిలోని నీటిని వేగంగా తోడేయడానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 240 మోటార్లను ప్రాజెక్టు నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మోటార్లన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా రోజుకు దాదాపు ఏడొందల క్యూసెక్కుల నీటిని తోడి అవతలికి పంపే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం అత్యంత శక్తివంతమైన మోటార్లను రంగంలోకి దించారు. వీటిలో కొన్ని 88 హార్స్ పవర్ (HP) సామర్థ్యం కలిగి ఉండగా, మరికొన్ని 83.5 హార్స్ పవర్ సామర్థ్యంతో పనిచేస్తాయి. డీ వాటరింగ్ పనుల మొదటి రోజున ప్రయోగాత్మకంగా 40 మోటార్లను ప్రారంభించి నీటిని తోడటం మొదలుపెట్టారు.

రాబోయే రోజుల్లో అక్కడ ఉండే అవసరాన్ని బట్టి, నీటి నిల్వలను బట్టి మిగిలిన మోటార్లను కూడా విడతలవారీగా అందుబాటులోకి తీసుకువచ్చి నడుపుతారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ముందుచూపుతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల పనులు నిరంతరాయంగా సాగుతాయి. రాబోయే కాలంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పరిసర ప్రాంతాల్లో కూడా ఈసీఆర్‌ఎఫ్ పనులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ డీ వాటరింగ్ ప్రక్రియను మరింత ముమ్మరంగా కొనసాగించనున్నారు.