శనివారం గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సందర్శించి పరిశీలించారు. ముందుగా పెదకాకాని, ఫిరంగిపురం మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడి లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో మీడియాతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని తెలిపారు. గుంటూరు జిల్లాలోని 13 మండలాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. నిబంధనల ప్రకారం తొలుత పోస్టల్ బ్యాలెట్లను తెరిచి లెక్కింపు చేపట్టినట్లు వివరించారు.
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియో రికార్డులను 60 రోజుల పాటు భద్రపరుస్తున్నామని తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధిత జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా కంకణాలపల్లి గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు తమ సమస్యలను తెలియజేస్తూ అందించిన వినతులపై కమిషనర్ స్పందించారు. గ్రామస్థాయిలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారానికి సంబంధిత జిల్లా కలెక్టర్ తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలతో పాటు దాదాపు 13 వేల గ్రామపంచాయతీలకు ఎన్నికల నిర్వహణ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీల ఎన్నికల అంశాన్ని కూడా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను మధ్యాహ్నం 4 గంటలలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, మొత్తం కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రంలోగా పూర్తవుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌తో పాటు జాయింట్ డైరెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, రిటర్నింగ్ అధికారులు హిమశైలజ, మయూరి, ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు.

