‘అధికారాంతమున చూడవలే ఆ అయ్య సౌభాగ్యముల్’ అని ఓ పద్యంలోని మాటలు అక్షర సత్యాలని ఏపీలో రుజువైంది. పదవిలో ఉన్న వాళ్ళ కోసం జనం పడిగాపులు పడతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్ల డోర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తుంటారు. సహాయం కోసమో సిఫార్సు కోసమో వచ్చే వాళ్ళతో మంత్రుల ఇళ్ల వద్ద నిత్యం జాతర వాతావరణం కనిపించేది. అదే నాయకుడికి పదవి ఊడిపోతే ఇందుకు పూర్తి రివర్స్ సీన్ కనిపిస్తుంది. సరిగ్గా ఇటువంటి వాతావరణమే ప్రస్తుతం కనిపిస్తోంది. గురువారం నాడు ఏపీ మంత్రులందరూ రాజీనామా చేయడంతో ప్రస్తుతం వారి ఇళ్ల వద్ద సందడి తగ్గిపోయింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఇదే పరిస్థితి నెలకొంది.
తాజాగా విశాఖలోని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటి దగ్గర సందడి బోసిపోయింది. సెక్యూరిటీ, ప్రోటోకాల్ అన్నీ ఖాళీ అయిపోయాయి. రాజీనామా తర్వాత అవంతి శ్రీనివాస్ హైదరాబాద్ వెళ్లిపోయారు. అటు సత్యసాయి జిల్లా పెనుకొండలోని మంత్రి శంకర్ నారాయణ నివాసం వద్ద కూడా ఇదే సీన్ నెలకొంది. కార్యకర్తలు, ప్రజలు లేకపోవడంతో ఆయన ఇంటి ప్రాంగణం బోసిపోయింది. దాదాపు అందరి మంత్రుల ఇళ్ల దగ్గర ఇదే సీన్ కనిపిస్తోంది. మూడేళ్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొద్ది గంటల వ్యవధిలోనే మాజీ అయిపోవడంతో ఇంటి దగ్గర సందడి లేకుండా పోయింది. నిత్యం మంత్రుల కార్యాలయాలు రద్దీగా కనిపిస్తూ కూర్చోవడానికి కుర్చీలు కూడా దొరికేవి కావు. అలాంటిది ప్రస్తుతం సీన్ రివర్స్ కావడంతో ప్రైవేట్ సెక్యూరిటీ తప్ప పిట్ట కూడా కనిపించడం లేదు. శ్రీకాకుళం జిల్లా పలాస లో సీదిరి అప్పలరాజు నివాసం వద్ద ఎవరూ లేరు , మంత్రి సీదిరి విజయవాడ లో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి సీమ వరకూ అంతటా ఇదే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని చూసి జనం నోరెళ్ళబెడుతున్నారు.
