AP Govt To Introduce Facial Recognition Attendace To Students: ఉన్నత విద్యాశాఖలోని అటెండెన్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొస్తోంది. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ వేసేలా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. డిసెంబర్ మొదటి వారం నుంచే ఈ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ నెలాఖరులోగా విద్యార్థులందరినీ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లోనూ ఇది అమలల్లోకి రానుంది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే హాజరు కావాల్సి ఉంటుంది. కేవలం రెండు నిమిషాల్లోనే విద్యార్థుల హాజరును నమోదు చేసే విధానం యాప్‌ని రూపొందిస్తున్నారు. జియో ట్యాగింగ్ సాంకేతిక ద్వారా ఆయా కాలేజీల్లో యాప్ పని చేసే విధంగా డిజైన్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తొలుత ఉపాధ్యాయులకు మాత్రమే ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మొదట్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఈ యాప్ పని చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. కొందరు ఈ విధానంపై వ్యతిరేకత కూడా కనబరిచారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు.. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని పిలుపునిచ్చాయి. సర్వర్ బిజీ, టైం అవుట్ వంటి సాంకేతిక సమస్యలు ఎదురైన నేపథ్యంలో.. ఈ విధానంపై టీచర్ల నుంచి వ్యతిరేకత నెలకొంది. అయితే.. వెంటనే ఈ సమస్యని పరిష్కరించారు. ఇప్పుడు ఉన్నత విద్యాశాఖలో విద్యార్థులకు కూడా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. విద్యార్థుల అటెండెన్స్ పెంచేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.