NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. పెళ్లి చేసుకుంటే డబ్బులు జమ

Jagan

Jagan

Andhra Pradesh: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకానికి జగన్ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఈ ప‌థ‌కం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌తో పాటు విభిన్న ప్ర‌తిభావంతుల పెళ్లిళ్ల‌కు ప్ర‌భుత్వం ఆర్థిక సాయం చేయ‌నుంది.  వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో పెళ్లి కానుక ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వైఎస్ఆర్ కళ్యాణమస్తు కింద ఎస్సీలకు రూ.లక్ష మేర పెళ్లి కానుక, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ. 1.20 లక్షలు, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు రూ.1.2 లక్షలు, బీసీలకు రూ. 50వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75వేలు, మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద రూ.లక్ష నజరానా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పథకాల అమలుతో 98.44 శాతం హామీలు నెరవేర్చామని జగన్ ప్రభుత్వం అంటోంది. కాగా ఈ కొత్త పథకాలు అక్టోబర్ 1 నుంచి అమలు చేసే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప‌థ‌కం అమ‌లు, విధి విధానాల‌కు సంబంధించి శ‌నివారం రాత్రి ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.