Delhi Science Tour : సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 52 మంది విద్యార్థులు న్యూ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున ఎంపికైన విద్యార్థులు ప్రస్తుతం ఢిల్లీలో పలు సైన్స్ సంబంధిత కేంద్రాలను సందర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఘజియాబాద్‌లోని కైట్ ఇంజనీరింగ్ కాలేజ్, మురాద్‌నగర్‌లో నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. రాకెట్ నిర్మాణం, దాని పనితీరు, ప్రాముఖ్యత వంటి అంశాలను కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వివరించింది. విద్యార్థులు ప్రత్యక్షంగా రాకెట్ ప్రదర్శనను వీక్షించి సైన్స్‌పై ఆసక్తిని వ్యక్తం చేశారు. రేపు ఈ విద్యార్థులు ప్రధానమంత్రి సంగ్రహాలయం, నెహ్రూ ప్లానిటోరియం, నేషనల్ సైన్స్ మ్యూజియం, రష్యా సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్‌లను సందర్శించనున్నారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంలోని అనేక విభాగాలపై అవగాహన పెంపొందించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యార్థులను కలుసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వారితో టూర్ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ఇలాంటి విజ్ఞాన పర్యటనలు భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగడంలో ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. రామ్మోహన్ నాయుడుతో కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విజ్ఞాన పర్యటనలో భాగంగా మరిన్ని సైన్స్ కేంద్రాలను సందర్శించేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.
Caste Expulsion: జనగామ జిల్లాలో కుల బహిష్కరణ కలకలం.. డీసీపీ కార్యాలయంకు చేరిన పంచాయితీ!
