ఏపీలో కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లే అమ్మాయిలకు ఇంటి పేరు మారుతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్రంలో చాలా మంది వివాహం చేసుకుని అత్తారింటికి వెళ్లే యువతులు తక్షణమే ఇంటి పేరు మార్చుకుని ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యువతులు తమ పెళ్లి తర్వాత అత్తింటి తరఫున పేరు మార్చుకునేందుకు వీలుగా గ్రామ సచివాలయంలో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు పెళ్లయిన యువతులు తమ పేర్లను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా ఇంటి పేరు మార్చుకోవాల్సిన మహిళల నుంచి అధికారులు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లోనే వేలిముద్రలు తీసుకుంటారు. ఆ విధంగా నమోదైన వేలిముద్రలకు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలుపుతారు. సదరు మహిళ పేరును రేషన్ కార్డులోనూ చేర్చుతారు. తద్వారా ఆమె ప్రభుత్వ పథకాలకు అర్హురాలు అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
