Site icon NTV Telugu

కరెంట్‌ కోతలపై సోషల్ మీడియాలో వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఇంధన శాఖ

power

power

సోషల్‌ మీడియా కొన్ని సార్లు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చినా.. కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తుంటాయి.. తాజాగా, కరెంట్ కోతలు విధిస్తున్నట్లు.. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్‌గా మారిపోయింది.. దీంతో చివరకు ఇంధన శాఖ దానిపై స్పందించాల్సి వచ్చింది.. దసరా పండుగ తర్వాత గ్రామాలు, మున్సిపాల్టీలు, నగరాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట గంటల కొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్‌ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రకటనలో పేర్కొన్న ఇంధన శాఖ.. అయినా, వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు విద్యుత్‌పంపిణీ సంస్థలు కృషి చేస్తున్నాయని వెల్లడించింది.

ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలతో అత్యవసర ప్రణాళికల అమలు చేపట్టామని వెల్లడించింది ఇంధన శాఖ.. ఏపీ జెన్కోకు బొగ్గు కొనుగోలు కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లు కేటాయించిందని తెలిపింది.. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారని తన ప్రకటనలో పేర్కొంది. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయని క్లారిటీ ఇచ్చింది.. మార్కెట్‌ ధర ఎంత ఉన్నా అత్యవసర ప్రాతిపదికన కొనాల్సిందిగా పంపిణీ సంస్థలకు ఆదేశించారని తెలిపింది. కాగా, విద్యుత్‌ సంక్షోభంపై ఈ మధ్యే సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా.. తీసుకోవాల్సిన అన్ని చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version