కోరోనా మహమ్మారిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష ముగిసింది… నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది.. ఆ మందుపై ఆయుష్ కమిషనర్ రాములు వివరాలు తెలియజేశారు.. ఇప్పటికే ఆనందయ్య మందు పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయన్న ఆయన.. రేపు చివరి నివేదిక రానుందన్నారు.. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.. ఇక, కేంద్రం సంస్థ సీసీఆర్ఏ అధ్యయన నివేదిక కూడా రేపు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు రాములు.
ప్రజలకు ఇబ్బందులు లేని విధంగా మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారని తెలిపిన ఆయుష్ కమిషనర్.. మందు పంపిణీపై తుది నిర్ణయం సోమవారం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు విచారణ నివేదికలు పాజిటివ్ గా వచ్చాయని.. టెలిఫోన్ ద్వారా నిర్వహించిన విచారణలోనూ చాలా మంది పాజిటివ్ గా చెప్పారని.. కానీ, ఆనందయ్య మందుపై క్లినికల్ ట్రైల్స్ ఇంకా ప్రారంభించలేదన్నారు.. ఎక్కడైనా క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటే మాత్రం అది అధికారికం కాదన్న రాములు.. మందుకు ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. దాంతో త్వరగా ప్రాసెస్ చేసి గుర్తిస్తామని తెలిపారు.