NTV Telugu Site icon

CM YS Jagan Golden Heart: మా కుమారుడిని బతికించాలని దంపతుల వినతి.. తానున్నానంటూ సీఎం జగన్‌ భరోసా

Ys Jagan

Ys Jagan

మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నిరుపేద బిడ్డ … లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని.. మీరు నిశ్చితంగా ఉండాలంటూ తన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు.. ఈ ఘటన శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో చోటుచేసుకుంది . ఈ సన్నివేశం బిడ్డ తల్లిదండ్రుల కంట ఆనందబాష్పాలు తెప్పించగా, సీఎం తక్షణ స్పందనకు అక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారుల మనసులు ద్రవించాయి .

Read Also: CBN: సైకో పాలన భూస్థాపితం చేసేవరకు.. రాష్ట్రాన్ని బాగు చేసేవరకు ఉంటా..

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకరరెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది . చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని పరిస్థితి.. దీంతో, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం జగన్‌.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.