ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులందరూ రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. కాగా అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు జగన్ చెప్పారని కొడాలి నాని వెల్లడించారు. కానీ ఎవరిని కొనసాగిస్తున్నారో చెప్పలేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదారుగురు మంత్రులు కొత్త కేబినెట్‌లో ఉండే అవకాశం ఉందన్నారు. కొత్త కేబినెట్‌లో తాను ఉండే అవకాశం తక్కువ అని కొడాలి నాని పేర్కొన్నారు. జగన్ ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటామని తెలిపారు.
మరోవైపు కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. తాజాగా మరో రెండు రెవెన్యూ డివిజన్లకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటిలో కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఓ డివిజన్ కాగా… జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మరో కొత్త డివిజన్‌గా ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వం 72 రెవెన్యూ డివిజన్‌లను ప్రకటించగా.. తాజా రెండు రెవెన్యూ డివిజన్‌లను కలుపుకుని ఆ సంఖ్య 74కి చేరింది.
అటు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి కూడా జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిల్లెట్ మిషన్ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పంచాయతీరాజ్ చట్ట సవరణను కేబినెట్ ఆమోదించింది. హెల్త్ హబ్ పథకం కింద ఐదు జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆసుపత్రుల నిర్మాణానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్య, వైద్య, ప్రణాళిక విభాగాల్లో నియామకాలకు ఆమోదం తెలిపింది.
https://www.youtube.com/watch?v=tzHmSrf4Diw
https://ntvtelugu.com/minister-adimulapu-suresh-praises-cm-jagan-before-ap-cabinet-meeting/
