Site icon NTV Telugu

Parakamani Case: పరకామణి కేసులో కీలక సాక్షి మృతి.. హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు..

Satish Kumar Murder

Satish Kumar Murder

Parakamani Case: అనంతపురం జిల్లా‌లో కలకలం రేగింది.. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతి చెందిన ఘటన సంచలనంగా మారగా.. ఈ ఘటనపై గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసులోని ప్రత్యర్థులే సతీష్ కుమార్‌ను హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు.. ఈ ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ పోలీసులు BNS 103(1)(B) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Read Also: Bihar CM: బీహార్ తదుపరి సీఎం ఎవరు? ఎక్స్ నుంచి జేడీయూ పోస్ట్ తొలగింపు!

మరోవైపు, నిన్న రాత్రి అనంతపురంలో సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సమావేశం నిర్వహించారు. పరకామణి కేసుతో సంబంధం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు రైలు కోచ్‌లో ప్రయాణికుల జాబితా సేకరించారు.. సతీష్ కుమార్ హత్య జరిగిన సమయంలో ఆయన ప్రయాణించిన A1 కోచ్‌లోని సహప్రయాణికుల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రయాణ రికార్డులు, CCTV ఫుటేజ్, రైలు స్టేషన్ల ట్రాకింగ్ డేటా ఆధారంగా నిందితుల జాడ కోసం ఆరా తీస్తున్నారు..

అయితే, పరకామణి కేసులో సాక్షిగా వ్యవహరిస్తున్న వ్యక్తి హఠాత్తుగా హత్యకు గురవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడిని పరకామణి కేసులోని ప్రత్యర్థులే పథకం ప్రకారంగా హత్య చేశారు అని ఫిర్యాదులో హరి పేర్కొనడం కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఈ కేసు ఇప్పటికే సంచలనంగా మారగా, సీఐడీ పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నందున మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా, తిరుమల శ్రీవారి పరకామణిలో సొమ్ము అపహరించిన కేసులో కీలక సాక్షి సతీష్ ప్రాణాలు కోల్పోవడంపై టీడీపీ సీనియర్ నేత పట్టాభి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.. సతీష్‌ది ముమ్మాటికీ హత్యే అని.. అసలు సతీష్ కు భయం ఉంటే‌‌‌.. గతంలోనే విచారణకు వచ్చే వారు కాదు కదా? అని ప్రశ్నించారు. సిట్ కార్యాలయానికి సతీష్ చేరితే వారి పాపం పండుతుందని భయపడే.. అతడిని లేకుండా చేశారని ఆరోపించారు.. అయితే, ఇప్పుడు హత్య కేసుగా నమోదు చేయడం సంచలనంగా మారిపోయింది..

Exit mobile version