High Tension in Tadipatri: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎప్పుడూ ఏదో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంటుంది.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా పరిస్థితి ఉంటుంది.. తాజాగా, తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సవాళ్లు–ప్రతి సవాళ్ల స్థాయికి చేరడంతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ పౌరుషం, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై ఇరువర్గాలు బహిరంగ సవాళ్లు విసరడంతో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది.
Read Also: Vasant Panchami 2026: బాసర లో వసంత పంచమి వేడుకలు.. కొనసాగుతున్న అక్షర శ్రీకార పూజలు
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. కర్నూలు కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్, అనంతపురం టవర్ క్లాక్ వంటి ప్రదేశాల్లో అయినా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, జేసీ వర్గీయులు కూడా అదే స్థాయిలో ప్రతిసవాళ్లు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డెక్కే అవకాశముందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పై తాడిపత్రి, అనంతపురం పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు చేశారు. FIR నం. 23/2026 (తేది: 22-01-2026) – సెక్షన్ 196(1) BNS, అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, FIR నం. 34/2026 (తేది: 22-01-2026) – సెక్షన్లు 351(2), 352, 353(2) r/w 3(5) BNS, తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్, FIR నం. 33/2026 (తేది: 22-01-2026) – సెక్షన్లు 351(2), 352 r/w 3(5) BNS, తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్.. ఇలా కేసులు నమోదు చేశారు పోలీసులు.. రాజకీయ నాయకుల వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.
