NTV Telugu Site icon

Anantapur Farmers: విషాదం.. విద్యుత్ తీగలు తెగపడి నలుగురు కూలీలు మృతి

Atp Farmers Died

Atp Farmers Died

Anantapur Farmers Died Because Of Eletric Wires: అనంతపురంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం ఆ ఇద్దరికి బళ్లారి ఆసుపత్రికి తరలించారు. బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో కొందరు వ్యవసాయ కూలీలు ఆముదం పంట కోయడానికి ట్రాక్టర్‌లో వెళ్లారు. పంట కోస్తున్న సమయంలో వర్షం పడింది. దీంతో.. ఇంటికి తిరిగి వెళ్దామని కూలీలు భావించారు. ఇంతలోనే విద్యుత్ మెయిన్ లైన్ తీగలు హఠాత్తుగా తెగబడ్డాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యవసాయ కూలీలు పేర్లు.. పార్వతీ, సక్రమ్మ, రత్నమ్మ, వండ్రక్క. ఘటన స్థలం.. మృతుల బంధువుల రోదనలతో శోకసంద్రంలా మారింది. పని కోసం వెళ్లిన తమ వారు.. ఇలా విగతజీవులుగా మారడాన్ని చూసి తట్టుకోలేక కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు.. బాధితులతో పాటు గ్రామస్తులు కూడా విద్యుత్ అధికారులపై మండిపడుతున్నారు. దర్గాహోన్నూరు సమీపంలో విద్యుత్ తీగలు ఎప్పటినుంచో వేలాడుతున్నాయని, విద్యుత్ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.