Massive Fire Breaks Out in Ernakulam Express: మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఎర్రాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం జరిగింది.. టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వైపు వెళ్తున్న.. టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 18189)లో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలోని దువ్వాడ–ఎలమంచిలి మధ్య ప్రాంతంలో జరిగింది. రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో AC కోచీల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Read Also: IBomma Ravi : ఐబొమ్మ కేసులో సంచలనం.. ఇమంది రవి ‘గుర్తింపు’ దొంగతనం..
రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో మంటలు వ్యాపించడం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. తొలుత B1 కోచ్‌లో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పక్కనున్న మరో కోచ్‌కూ వ్యాపించాయి. లోకో పైలట్ మంటలను గమనించి వెంటనే ఎలమంచిలి స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. ప్రయాణీకులు అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపేందుకు సహకరించారు. అయితే, అగ్ని ప్రమాదంలో రైలులోని M1, B2 అనే రెండు ఏసీ కోచీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని వేగంగా వ్యాపించినప్పటికీ, రైల్వే సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్క వృద్ధుడు ఈ ఘటనలో సజీవ దహనం కాగా.. మిగతా ప్రయాణీకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం వృద్ధుడు సజీవ దహనం అయ్యారు.. మిగతా ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.. ఇక, సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి, అనకాపల్లి నుంచి ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మొత్తం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి సుమారు 80 శాతం మేర మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, రెండు కోచీలు మాత్రం పూర్తిగా కాలిపోయాయి.
రైళ్ల రాకపోకలపై ప్రభావం.. అనకాపల్లిలో నిలిచిపోయిన పలు ట్రైన్లు
అగ్ని ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. అనకాపల్లి వద్ద పలు రైళ్లు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ప్రయాణీకులు తెలిపారు. ఘటన తర్వాత, రైల్వే సిబ్బంది ఇతర కోచ్‌లను ప్రమాదానికి గురైన బోగీల నుంచి వేరు చేశారు. ట్రాక్ క్లియరెన్స్, మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి.
రైల్వే అధికారుల ప్రకటన
ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. “మంటలు చెలరేగిన కారణాలపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించాం. ప్రయాణీకులు అప్రమత్తంగా వ్యవహరించడం, సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. రైళ్ల రాకపోకలను త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తాం” అని తెలిపారు.
