Site icon NTV Telugu

ONGC Gas Blowout: గ్యాస్‌ బ్లోఅవుట్‌.. జిల్లా కలెక్టర్‌, ఓఎన్జీసీ కీలక ప్రకటన.. మరో ఐదు రోజులు..!

Ongc Gas Blowout

Ongc Gas Blowout

ONGC Gas Blowout: డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్‌ బ్లోఅవుట్‌పై కీలక ప్రకటన చేశారు జిల్లా కలెక్టర్‌, ఓఎన్జీసీ.. ఇరుసుమండ ప్రాంతంలో కొనసాగుతున్న గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఓఎన్జీసీ టెక్నికల్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో… బ్లోఅవుట్‌ కట్టడి చర్యలు, భద్రతా పరిస్థితులపై స్పష్టత ఇచ్చారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. కోనసీమలోని గ్యాస్ బ్లోఅవుట్ మరో ఐదు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇప్పటికే 95 శాతం బ్లోఅవుట్‌ను విజయవంతంగా కట్టడి చేశామని, మిగిలిన గ్యాస్‌ను క్యాపింగ్ చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు..

Read Also: IIT-H ఎయిర్ టాక్సీ వచ్చేసింది.! Hyderabadలో ట్రాఫిక్‌ కష్టాలకు ఇక ‘టాటా’

అయితే, బ్లోఅవుట్‌ కొనసాగినా ఎలాంటి ప్రాణహాని, ప్రమాదం ఉండదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని విక్రమ్ సక్సేనా తెలిపారు. గ్యాస్ లీక్‌ ప్రాంతంలో ప్రస్తుతం వాటర్ అంబ్రెల్లా భద్రతా విధానం అమలు చేస్తున్నామని, ఐదు వైపులా నిరంతరం నీరు చిమ్ముతూ మంటలు చెలరేగకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. భూభాగంలో మిగిలిన గ్యాస్‌ను పూర్తిగా నియంత్రించేందుకు రోజుకు అనేక టెక్నికల్ పరిశీలనలు, నిపుణుల సూచనలతో క్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇక, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఒక్క ప్రాణి కూడా ప్రమాదానికి గురికాలేదని అధికారులు ధృవీకరించారు. బ్లోఅవుట్‌ కారణంగా కాలిపోయిన కొబ్బరి చెట్లు, దెబ్బతిన్న పంట భూములకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, మరో ఏడు రోజులు పాటు Water Umbrella విధానంలో ఐదు వైపులా నీటిని చిమ్మే రక్షణ చర్యలు కొనసాగుతాయని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బ్లోఅవుట్‌ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ నిపుణులు, కేంద్ర–రాష్ట్ర విభాగాలు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం 95% కట్టడి కావడంతో ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గిందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు అధికారులు..

Exit mobile version