Site icon NTV Telugu

Antarvedi Rathayatra: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథయాత్ర..

Antharvedi

Antharvedi

Antarvedi Rathayatra: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ మహత్కార్యం భక్తులను పరవశింపజేసింది. అశేష భక్తజన సందోహం మధ్య ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుక అంబరాన్ని తాకింది. రోహిణీ నక్షత్ర యుక్త తులా లగ్నం, పుష్కరాంశమున అర్థరాత్రి ఒంటి గంట 56 నిమిషాలకు స్వర్ణకాంతులతో శ్రీదేవి, భూదేవులతో కలిసి శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి కల్యాణం జరిగింది.

Read Also: Team India Biggest Defeats: స్వదేశంలో టీమిండియాకు భారీ షాక్.. అతిపెద్ద పరాజయాల లిస్ట్ ఇదే!

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం “నమో నారసింహా” నామస్మరణలతో మార్మోగింది. పంచముఖాంజనేయ సేవ, గరుడవాహన సేవ, ఎదుర్కోలు లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను ప్రధాన ఆలయం నుంచి తీసుకొచ్చి, పరిమళభరిత పుష్పాలతో సుందరంగా అలంకరించిన వేదికపై కొలువుదీరారు. అర్చకులు శ్రీనివాసకిరణ్ ఆధ్వర్యంలో వైదిక బృందం పరిణయ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి సమర్పించారు. ఈ దివ్య కల్యాణాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

Read Also: TTD Ghee Adulteration Case : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

అయితే, ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రథయాత్ర ప్రారంభంకానుంది. రథోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. కళ్యాణ దివ్యమూర్తులను రథంపై కొలువు దీర్చి భక్తజనం నడుమ వైభవంగా ఊరేగించడం అంతర్వేది క్షేత్రంలో ఆనవాయితీగా వస్తుంది. ఉత్సవాల ఆరంభం రోజునే అంతర్వేది మెరక వీధిలో సిద్ధం చేసిన రథాన్ని పుష్పాలంకరణ, భక్తులు సమర్పించిన అరటి గెలలతో ఆలయ అధికారులు తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు రథయాత్ర స్టార్ట్ కానుంది. పోలీసులు దారి పొడవునా భారీ బందోబస్తుకు ఏర్పాట్లు చేశారు. రథం తిరిగే మార్గంలో ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Exit mobile version