YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక

Ys Jagan Press Meet

Ys Jagan Press Meet

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జగన్‌.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్‌ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీలు హాజరయ్యారు..

వైసీపీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వరన్న గత అనుభవం తమ ముందుందని జగన్ అన్నారు. గతంలో ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలను చూశామని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి కాదని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా నాయకుడు తమతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కల్పించాలని సూచించారు. ఇప్పుడు కార్యకర్తలకు అండగా నిలిస్తే.. భవిష్యత్‌ సాధారణ ఎన్నికల్లో వారు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తారని అన్నారు.

స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన తమకు ఒక రకంగా అనుకూలమేనని జగన్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ పదవులకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని సూచించారు. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతో పాటు బలం లభిస్తుందని చెప్పారు. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను సైతం పోటీలోకి దింపేందుకు వెనకాడవద్దని జగన్ సూచించారు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ ఉండాలని అన్నారు.

ఏకగ్రీవాలపై జగన్ కీలక హెచ్చరిక

ఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే.. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కో-ఆర్డినేటర్లు పార్టీ అభ్యర్థులు కాలేరని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారనే దానిపై ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటానని జగన్ తెలిపారు. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతు ఇచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటానని చెప్పారు. “కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే.. మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు” అని పేర్కొన్నారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..