Site icon NTV Telugu

YS Jagan: సత్యమేవ జయతే.. టీడీపీ, జనసేన నేతలపై వైఎస్‌ జగన్‌ ఫైర్..

Ys Jagan

Ys Jagan

YS Jagan: టీడీపీ, జనసేన పార్టీల అబద్ధపు ప్రచారాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన పార్టీలు అధికారం లోకి రాకముందు కూడా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత వైసీపీ ప్రభుత్వంపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయని జగన్ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయాయని, పారిశ్రామికవేత్తలు పారిపోయారని, ఎలాంటి పారిశ్రామిక పురోగతి లేదంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు నిజమైతే రాష్ట్రంలోని తయారీ, పారిశ్రామిక రంగాల పనితీరు అత్యంత దారుణంగా ఉండేదని జగన్ వ్యాఖ్యానించారు. కానీ వాస్తవ గణాంకాలు మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

Read Also: SIR Effect: కేరళ, అండమాన్–నికోబార్, ఛత్తీస్‌గఢ్‌లో లక్షల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపు..!

భారత రిజర్వ్ బ్యాంక్ ఈ నెల విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, 2019–2024 కాలంలో ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ప్రథమ స్థానంలో, యావత్ దేశంలో 5వ స్థానంలో నిలిచిందని జగన్ గుర్తుచేశారు. అదే విధంగా, పారిశ్రామిక రంగం మొత్తం పురోగతిలో కూడా ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతంలో నెం.1గా, దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇలాంటి గణాంకాలు ఉన్నప్పటికీ బ్రాండ్ ఏపీ నాశనమైందని ఎలా చెబుతారని ప్రశ్నించిన జగన్, ఇది సమర్థవంతమైన పాలన ఫలితమా? లేక కావాలనే చేసిన దుష్ప్రచారమా? అని నిలదీశారు. చివరగా, నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని పేర్కొంటూ “సత్యమేవ జయతే” అంటూ తన వ్యాఖ్యలను ముగించారు.

Exit mobile version