Site icon NTV Telugu

YS Jagan Padayatra: ప్రజల మధ్యే ఉంటా.. 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా..

Ys Jagan Padayatra

Ys Jagan Padayatra

YS Jagan Padayatra: రాబోయే కాలంలో ప్రజల మధ్యే ఉంటూ 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి… గ్రామస్థాయిలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేస్తామని, జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుందని స్పష్టం చేశారు. “ఈసారి ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్‌బాల్ తన్నినట్టుగా తంతారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, ఇసుక, మద్యం, ఖనిజాల రంగాల్లో విస్తృత స్థాయిలో అవినీతి జరుగుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం చంద్రబాబు నాయుడు మరియు ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తోందని విమర్శించారు. బెల్టుషాపులు, మద్యం షాపులన్నీ అధికార పార్టీ నేతల ఆధీనంలోనే నడుస్తున్నాయని మండిపడ్డారు.

Read Also: Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!

గత ఎనిమిది త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. వసతి దీవెన నిధులు కూడా ఇవ్వలేదని, గోరుముద్ద పథకంలో నాణ్యత పూర్తిగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో కల్తీ ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా నిర్వీర్యమైందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, యూరియా కూడా అందుబాటులో లేదన్నారు జగన్‌.. ఇక, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారని జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్‌, సూపర్ సెవెన్‌ హామీలు పూర్తిగా అబద్ధాలని తేలిపోయాయని అన్నారు. గ్యాస్ సిలిండర్ల నుంచి మద్యం వరకు ప్రతి రంగంలోనూ మోసాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మరోవైపు, వైసీపీ హయాంలో ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశామని, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని జగన్ స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు పూర్తికాకముందే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో “దోచుకో–పంచుకో–తిను” అనే విధానం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ జగన్..

Exit mobile version