Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాతావరణం హీట్‌ పెంచుతుంది.. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.. ఇక, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిలుపునిచ్చారు. గన్నవరంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామస్థాయి నుంచే బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికలను పార్టీ బలోపేతానికి కీలకమైన అవకాశంగా ఉపయోగించుకోవాలని అన్నారు.

వైసీపీకి చెందిన నాయకులు స్థానికంగా లేకపోతే అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉంటుందని వంశీ వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు పనిచేయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ అధినేత జగన్ కూడా ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో గన్నవరం సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలనపై వంశీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం గ్రామగ్రామాన నాణ్యమైన మద్యం అందిస్తోందని, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక అవసరాలు అందుబాటులో లేకపోయినా మద్యం మాత్రం అందుబాటులో ఉంచుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

గత ఎన్నికల హామీలను ప్రస్తావించిన వంశీ.. 2014లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ హామీలతో టీడీపీ తరఫున ఓట్లు అడిగామని గుర్తుచేశారు. అయితే వాటి అమలును ప్రారంభించడానికి రెండేళ్లు సమయం తీసుకుని, చివరకు హామీలను అటకెక్కించారని ఆరోపించారు. ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలతో పాటు చెప్పని హామీలను కూడా అమలు చేసిందని వంశీ పేర్కొన్నారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు మరోసారి అమలు చేయని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొనలేకపోతోందని, మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా చేపట్టలేదని విమర్శించారు.

ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందడం లేదని వంశీ ఆరోపించారు. ఈ అంశాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు వల్లభనేని వంశీ మోహన్‌.. మొత్తంగా.. ఏపీలో ఓవైపు స్థానిక ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల సంఘం ఏర్పాట్ల వైపు అడుగులు వేస్తుండగా.. మరోవైపు.. అన్ని రాజకీయ పార్టీలు.. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి..