President Droupadi Murmu: లఖ్‌పతి దీదీలు కాదు.. కరోడ్‌పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..

President Droupadi Murmu

President Droupadi Murmu

President Droupadi Murmu: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా స్వయం సాధికారత సాధించడంతో పాటు లక్షాధికారుల నుంచి కోటీశ్వరులుగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆకాంక్షించారు. అమరావతిలో నిర్వహించిన జాతీయ సరస్ మేళా–2026 కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. దేవీ శరన్నవరాత్రుల పర్వదినాల్లో కనకదుర్గమ్మ సన్నిధిలో జాతీయ సరస్ మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా స్వయం సహాయక సంఘాల జాతీయ సరస్ మేళాను నిర్వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను రాష్ట్రపతి అభినందించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ద్రౌపదీ ముర్ము తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు సాంకేతిక, ఆర్థిక రంగాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. మహిళలను కేవలం ‘లఖ్‌పతి దీదీ’లుగా కాకుండా ‘కరోడ్‌పతి దీదీ’లుగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి జరగాలని ఆకాంక్షించారు రాష్ట్రపతి..

ఇక, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులు స్వయం సాధికారత సాధించేలా అవసరమైన సహకారం అందించాలని రాష్ట్రపతి సూచించారు. మహిళలు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునేలా మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేందుకు అన్ని వ్యవస్థల్లోనూ మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. గ్రామీణ మహిళలకు డిజిటల్ మాధ్యమాలు, డిజిటల్ విధానాలపై మరింత అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా వారు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించగలరని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పొరుగునే ఒడిశా రాష్ట్రం ఉన్నప్పటికీ, తాను తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్నానని రాష్ట్రపతి అన్నారు. త్వరలోనే తెలుగు భాషను నేర్చుకుని, మరోసారి వచ్చి తెలుగులోనే ప్రజలతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగు భాషపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భగవాన్ విష్ణువు మరో రూపమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. అమరావతిలో కనిపించే శిల్పకళా చాతుర్యం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని అన్నారు. మహిళా సాధికారత, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు జాతీయ సరస్ మేళా ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి అని వ్యాఖ్యానించారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..