Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్‌.. గోయింగ్ ఆన్ వెరీ వెల్‌”

Polavaram

Polavaram

Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ నిర్మాణ పనుల నాణ్యతపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మట్టి నాణ్యత, తేమ శాతం, కుదింపు అనంతరం గట్టిదనాన్ని పరిశీలించిన నిపుణులు.. నిర్మాణ పనులు బాగున్నాయంటూ ప్రశంసించారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని అభిప్రాయపడుతూ.. “ఇట్స్ వెరీ గుడ్‌.. గోయింగ్ ఆన్ వెరీ వెల్‌” అంటూ హర్షం వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు అంతర్జాతీయ నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్‌ వోహ్రాతో కలిసి గ్యాప్‌-2 ప్రాంతంలో నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలో సుమారు మూడున్నర గంటల పాటు పరిశీలన కొనసాగించారు. నిర్మాణంలో ఉపయోగిస్తున్న మట్టి నాణ్యత, అందులో తేమ శాతం, మట్టిని కుదించిన తర్వాత ఏర్పడుతున్న గట్టిదనాన్ని నిపుణులు నిశితంగా పరిశీలించారు. పరీక్షల సమయంలో పీపీఏ సీఈవో సంజీవ్‌ వోహ్రా సైతం స్వయంగా మట్టిని తవ్వి పరిశీలనలో పాల్గొన్నారు. మట్టి నాణ్యతను ప్రత్యక్షంగా తనిఖీ చేయడంతో పాటు, నిర్మాణంలో అనుసరిస్తున్న పద్ధతులు, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. మట్టి తేమ శాతం నిర్మాణానికి అనువుగా ఉందా? కుదింపు ప్రక్రియ అనంతరం ఆశించిన గట్టిదనం వస్తోందా? అనే అంశాలపై క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించారు.

డ్యామ్‌ నిర్మాణంలో కీలకమైన మట్టి కుదింపు ప్రక్రియను సైతం అంతర్జాతీయ నిపుణులు పరిశీలించారు. ఇందుకోసం ఉపయోగిస్తున్న షీప్‌ ఫుట్‌ రోలర్‌ పనితీరును గమనించారు. రోలర్‌తో మట్టిని కుదించిన అనంతరం దాని గట్టిదనాన్ని పరీక్షించారు. నిర్మాణంలో నాణ్యతను నిర్ధారించేందుకు ఇలాంటి పరీక్షలు కీలకమైన నేపథ్యంలో.. మట్టి లక్షణాలు, కుదింపు స్థాయిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణ పనుల నాణ్యతపై నిపుణులు సంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మట్టి నాణ్యత, తేమ శాతం, గట్టిదనానికి సంబంధించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావడంతో పనుల పురోగతిపై ప్రశంసలు కురిపించారు. అయితే, నిర్మాణ పనుల నాణ్యతను మరింతగా నిర్ధారించేందుకు పరీక్షలను కొనసాగించనున్నారు. పోలవరం ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను ముందుకు తీసుకెళ్లే క్రమంలో అంతర్జాతీయ నిపుణుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది.