Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు

Gottipati

Gottipati

Minister Gottipati Ravikumar: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నా, ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సీఎండీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కీలక సూచనలు చేశారు. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించకూడదని కఠినంగా ఆదేశించారు. ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్ సరఫరా aఅంతరాయం కలిగితే, వెంటనే ప్రజలకు సమాచారం ఇవ్వడంతో పాటు సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా సూచించారు.

 

ఇక, వేసవి డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడం ఎందుకని ఆరా తీశారు మంత్రి గొట్టిపాటి.. దీనికి అధికారులు సమాధానమిస్తూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, అకాల వర్షాల వల్ల విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం వంటి కారణాలతో తాత్కాలిక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. వేసవిలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే నేపథ్యంలో, ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌..