Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?

Minister Nara Lokesh

Minister Nara Lokesh

Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ రావొచ్చు అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన కూటమి ప్రభుత్వం.. ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది.. ఈ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని లోకేష్ తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడంపై కూడా లోకేష్ స్పందించారు. రిజర్వేషన్లు ఇంకా ఖరారు చేయకుండానే అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ స్థానానికి ఏ వర్గానికి రిజర్వేషన్ ఉంటుందో స్పష్టత ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.

టీడీపీకి బీసీలే వెన్నుముక
తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నుముక అని లోకేష్ అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం తన వైఖరికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. అంతేకాదు.. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో తదుపరి విచారణలో స్పష్టమవుతుందని లోకేష్ అన్నారు. కోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏపీ హైకోర్టు 34 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసి, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే..