Site icon NTV Telugu

Head Constable Help Students: హ్యాట్సాఫ్ వెంకటరత్నం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..

Constable Venkataratnam

Constable Venkataratnam

Head Constable Help Students: తోటివారి కష్టాన్ని చూసి వెంటనే స్పందించి వారికి తోచిన సాయం చేసేవాళ్లు ఉంటారు.. ఐదో.. పదో ఇచ్చి తాము సాయం చేశాం అనుకునేవాళ్లు ఉంటారు.. అయితే, మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్తున్న కొంతమంది పిల్లలను చూసి చలించిపోయారు వెంకటరత్నం అనే హెడ్‌ కానిస్టేబుల్‌. పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోన్న వెంకటరత్నం.. విద్యార్థులను చూసి వదిలేయకుండా.. వెంటనే వారిని తీసుకుని సమీపంలోని ఫుట్‌వేర్‌ షాపుకు వెళ్లారు.. అక్కడ ఎవరికి ఏ సైజ్ చెప్పులు పడతాయో.. వారికి అవి ఇప్పించారు.. దీంతో, ఆ చిన్నారుల ఆనందానికి అవదలు లేకుండా పోయాయి.. వారి ముఖంలో చిరునవ్వు చూసి.. ఆయన మురిసిపోయారు.. తమకు చెప్పులు కొనిపించిన కానిస్టేబుల్‌ వెంకటరత్నంకు షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ.. థ్యాంక్స్‌ చెబుతూ.. ఆ చిన్నారులు మురిసిపోయారు..

Read Also: Sharan Navaratri Day 1: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం..

ఇక, ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో.. మంత్రి నారా లోకేష్‌ స్పందించారు.. “హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు.. స్పందించిన మీ మనసుకు సెల్యూట్..” అంటూ ట్వీట్ చేశారు.. ” ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్‌ని నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హాట్సాఫ్. చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ, థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి.. ఎంత గొప్పది! ఇంకెంత అమూల్యమైనది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు..” అంటూ ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్..

మరోవైపు, మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటరత్నంను అభినందించారు స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్.. మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్తున్న పిల్లలు చూసి చలించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటరత్నం.. వెంటనే పిల్లలందరికీ తన సొంత ఖర్చుతో చెప్పులు కొని పంపించారు .. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్.. ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ, కానిస్టేబుల్ వెంకటరత్నంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు ఎమ్మెల్యే బోడె ప్రసాద్..

Exit mobile version