NTV Journalists Arrest: ఎన్టీవీలో ప్రసారమైన కథనానికి సంబంధించి జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణాచారి, సుధీర్‌లను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడాన్ని నేషనల్ అలయెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (NAJ), ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF), ఏపీ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) తీవ్రంగా ఖండించాయి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నేరుగా జర్నలిస్టులను అరెస్టు చేయడం అనైతికమని ఈ సంఘాలు పేర్కొన్నాయి.. ప్రసారం చేసిన కథనంపై ఇప్పటికే ఎన్టీవీ యాజమాన్యం క్షమాపణ చెప్పినప్పటికీ, జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొన్నాయి.
Read Also: Kishan Reddy: జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికం..
జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి, చట్టపరమైన విధి విధానాలు పాటించకుండా, నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాయి. ఈ తరహా చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడిగా భావించాల్సి వస్తుందని, మీడియాను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలుగా ఇవి కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి. అయితే, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తా కథనాలు ప్రసారం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా సంస్థలపై కూడా ఉందని ఈ సందర్భంగా సంఘాలు గుర్తు చేశాయి. అదే సమయంలో, వార్తలపై అభ్యంతరాలు ఉంటే చట్టపరమైన మార్గాలను అనుసరించాల్సిందే తప్ప, పోలీసు బలాన్ని ఉపయోగించి జర్నలిస్టులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని స్పష్టం చేశాయి. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు ఎన్. కొండయ్య (NAJ), ఎస్. వెంకట్రావు – అధ్యక్షులు, జి. ఆంజనేయులు – ప్రధాన కార్యదర్శి (APWJF), వి. శ్రీనివాసరావు, కె. మునిరాజు (APBJA)..
