Jana Sena Party: జనసేన పార్టీ.. రాష్ట్ర ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు కీలక విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కార్యాలయాలకు ప్రతిరోజూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్న పరిస్థితి ఆందోళనకరమని జనసేన పేర్కొంది. చిన్నచిన్న సమస్యలకే ప్రజలు రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాల్సి వస్తోందంటే, అది వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదనే సంకేతమని స్పష్టం చేసింది. స్థానిక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని జనసేన అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనేక పనులు క్షేత్ర స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదేనని స్పష్టం చేసింది.
Read Also: Apple Watch Series 11: ఆపిల్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్.. ఎన్ని వేలు తగ్గిందో చూసేయండి!
ప్రజలు తమ సమస్యలను ముందుగా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని జనసేన సూచించింది. అక్కడ స్పందన లేకపోతేనే రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాలన్నది పార్టీ విజ్ఞప్తి. ప్రజా సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు బాధ్యత తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జనసేన కోరింది. తమ పరిధిలో ఉన్న నిధులను ప్రజా సమస్యల పరిష్కారానికి సక్రమంగా వినియోగించుకోవాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు జనసేన సూచించింది. స్మశానం, డంపింగ్ యార్డ్, కరెంట్, ఆధార్, ఓటర్ కార్డ్ వంటి ప్రాథమిక సమస్యలు కూడా రాష్ట్ర స్థాయికి రావాల్సి వస్తుండటం పట్ల పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడు పేట పంచాయితీలో చోటుచేసుకున్న ఘటనను జనసేన ప్రత్యేకంగా ప్రస్తావించింది. అక్కడ గిరిజనులు ఎదుర్కొంటున్న కరెంట్, ఆధార్, ఓటర్ కార్డ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మొత్తంగా స్థానిక పాలనకు ఆదర్శంగా నిలవాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందుకు రావాలని జనసేన పార్టీ పిలుపునిచ్చింది. ప్రజల సమస్యలు స్థానిక స్థాయిలోనే పరిష్కారమయ్యేలా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది జనసేన పార్టీ..
