AP Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళుతున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలకు అవకాశం ఉంది. శనివారం నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడా జల్లులు కురుస్తాయి. ఇక అల్పపీడనం కారణంగా ఏపీలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అల్పపీడనం తీరానికి సమీపంలో ఉండటంతో తీర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఏపీలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి.
Read Also: Auto Johnny : మళ్లీ తెరపైకి ఆటోజానీ.. సెకండ్ ఆఫ్ ఛేంజ్ చేస్తున్న పూరీ
కాగా, వరుసగా అల్పపీడనాలు, తుఫాన్ లు ఏపీని టెన్షన్ పెడుతూనే ఉన్నాయి.. ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో పలు మార్లు భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాంధ్రను వర్షాలు వీడడం లేదు.. పంటల కోసే సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది.. ఇక, ఈ నెల చివరలోనూ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది..