Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఆఖరి విడతగా రూ.567 కోట్ల గ్రాంటును కేంద్రం విడుదల చేసింది.. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత 19 నెలల కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 48 శాతం మేర వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిధుల వినియోగం గణనీయంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషికి కేంద్రం గుర్తింపు ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు.
Read Also: 10,000mAh బ్యాటరీ క్లబ్ లోకి Realme P సిరీస్.. భారత్‌లో లాంచ్ అప్పుడే..!
పూర్తి స్థాయిలో 15వ ఆర్థిక సంఘం నిధులను పొందిన మూడవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని వెల్లడించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇది రాష్ట్రానికి గర్వకారణమని, ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని చెప్పారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో 2025–26 బడ్జెట్ వ్యయంపై మంత్రి సమీక్షించారు. మిగిలిన నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయం సాధించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ఆసుపత్రుల బలోపేతం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
