Site icon NTV Telugu

Free Electricity: చేనేత కుటుంబాలకు శుభవార్త.. ఇవాళ్టి నుంచే ఉచిత విద్యుత్

Free Electricity For Weaver

Free Electricity For Weaver

Free Electricity: ఆంధ్రప్రదేశ్‌ సర్కార చేనేత కార్మికులకు మరో శుభవార్త అందించింది. ఇవాళ్టి నుంచి చేనేతల కోసం ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నేతన్నలకు ఆర్థిక ఉపశమనం లభించనుంది. అమరావతిలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం, మగ్గం నేతన్నలకు నెలకు 200 యూనిట్ల వరకు, మరమగ్గం (పవర్‌లూమ్) నేతన్నలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. దీంతో చేనేత రంగంలో పనిచేసే కార్మికులపై విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి సుమారు రూ.150 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, చేనేతల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం ద్వారా సుమారు 1.04 లక్షల చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఉచిత విద్యుత్ వల్ల మగ్గం నేతన్నలు సంవత్సరానికి సుమారు రూ.8,640 వరకు ఆదా చేసుకోగలుగుతారు. అలాగే మరమగ్గం నేతన్నలు ఏడాదికి రూ.21,600 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడనుంది.

ఇది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒకటిగా ఉండగా, ఇప్పుడు ఆ హామీ నెరవేరడం పట్ల చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేతల గౌరవప్రదమైన జీవనమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా చేనేత రంగం మరింత బలపడుతుందని, కార్మికులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version