Site icon NTV Telugu

AP Assembly Ethics Committee: సభకు ఎందుకు రావడం లేదు..? వైసీపీ ఎమ్మెల్యేల వివరణ కోరనున్న ఎథిక్స్‌ కమిటీ..

Ap Assembly

Ap Assembly

AP Assembly Ethics Committee: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల హాజరుపై ప్రతీసారి చర్చ సాగుతూనే ఉంది.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మొక్కుబడిగా ఒక్కరోజు మాత్రం అసెంబ్లీకి వచ్చి వెళ్లిపోతున్నారు.. ఆ తర్వాత సెషన్‌ మొత్తం సభ వైపు చూడడం లేదు.. అయితే, వైసీపీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా గైర్హాజరు కావడంపై అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు కమిటీ నుంచి అధికారిక పిలుపు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: Raja Saab : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 10 రోజుల పాటు హైక్.. ఏపీ జీవోలో ఏముందంటే?

ఏపీ అసెంబ్లీలో ఎథిక్స్‌ కమిటీ సమావేశం జరిగింది.. కమిటీ చైర్మన్‌ మండలి బుద్దప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడంపై చర్చించారు.. అయితే, అసెంబ్లీకి హాజరు కాకపోవడానికి గల కారణాలపై ఎమ్మెల్యేలు నుంచి లిఖితపూర్వక వివరణ కోరనున్నట్లుగా తెలుస్తోంది.. సభకు ఎప్పటి నుంచి హాజరు కావడం లేదు?.. ఎందుకు అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు?.. సభకు దూరంగా ఉండటానికి గల స్పష్టమైన కారణాలు ఏమిటి? అనే విషయాలపై సదరు ఎమ్మెల్యేలను ప్రశ్నించాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది.. వచ్చే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు వైసీపీ ఎమ్మెల్యేలను ఎథిక్స్ కమిటీ పిలిచి వివరణ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో వారి పూర్తి స్థాయి భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ భావిస్తోంది. ఎథిక్స్ కమిటీ నుంచి నోటీసులు జారీ అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు తమ వాదన, గైర్హాజరు వెనుక ఉన్న కారణాలను అధికారికంగా కమిటీ ముందు ఉంచనున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఈ వ్యవహారం ఒక తుది స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Exit mobile version