Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ పార్టీ ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో వన్ టూ వన్ సమావేశం ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న (ఆన్ గోయింగ్) ప్రాజెక్టుల వివరాలపై పవన్ కల్యాణ్ సమీక్షించారు. అలాగే నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కార మార్గాలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు.
Read Also: Adivi Sesh : సినిమాల రిలీజ్ విషయంలో రాజమౌళి స్ట్రాటెజీనీ ఫాలో అవుతున్న అడివి శేష్
అదేవిధంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలతో సమన్వయం వంటి అంశాలపై కూడా డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా చేరేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలని సూచించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అనంతరం దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీ కృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్‌లతో పవన్ కల్యాణ్ వన్ టూ వన్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల ద్వారా ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి, పాలనలో వేగం పెంచడం, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
