Site icon NTV Telugu

Cyclone Ditwah: దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలు.. ఎల్లుండి ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

Cyclone Ditwah

Cyclone Ditwah

Cyclone Ditwah: నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా తుఫాన్‌ ‘ కొనసాగుతోంది.. తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తుపాన్ గడిచిన 6 గంటల్లో 3కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించారు. ఎల్లుండి తెల్లవారుజామునకు తీవ్ర వాయు గుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు..

Read Also: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దిత్వా తుపాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం.. సహాయక చర్యలకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని ప్రఖర్ జైన్ తెలిపారు. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 50-70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 18004250101 నెంబర్లు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక, రానున్న రెండు రోజులు వాతావరణ వివరాలు కింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. రేపు అనగా శనివారం రోజు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇక, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి అనగా ఆదివారం రోజు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Exit mobile version