Site icon NTV Telugu

CM Chandrababu: పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం..

Cbn

Cbn

CM Chandrababu: గ్లోబల్ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులను పండించేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన రంగాల అభివృద్ధిపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సూచించారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యానరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Municipal Elections : మోగిన తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా.. పూర్తి వివరాలు ఇవే..!

రాష్ట్రంలోని 10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువులుగా అభివృద్ధి చేసేలా సమీకృత అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్వోదయ నిధులను వినియోగించి సమగ్రాభివృద్ధి సాధించాలని సూచించారు. అలాగే, 10 జిల్లాల్లో 20కి పైగా పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. “పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేద్దాం.. పడగొట్టినవి నిలబెడదాం” అంటూ ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశారు. ఇక, ఉద్యాన ఉత్పత్తుల సరఫరాకు అనుగుణంగా గ్రామీణ రహదారుల నెట్‌వర్క్, లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఉత్పత్తులు రైతుల వద్ద నుంచి మార్కెట్‌కు సులభంగా చేరేలా మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు ఆదాయం పెరిగేలా, రాష్ట్రానికి ఎగుమతుల ద్వారా ఆదాయం వచ్చేలా ఉద్యానరంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Exit mobile version