Site icon NTV Telugu

Wild Cows: అడవి ఆవుల సమస్య పరిష్కరించండి.. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్..

Wild Cows

Wild Cows

Wild Cows: ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు మండలంలో రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న అడవి ఆవుల సమస్యను జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణా నది లంక ప్రాంతాల్లో సుమారు 2,000కు పైగా అడవి ఆవులు తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. చందర్లపాడు మండలంలోని కృష్ణా నది లంక పొలాల్లో ఒకేసారి అడవి ఆవుల గుంపులు మేత కోసం పంటలపై పడి భారీగా నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పంటలను తొక్కి ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అడవి ఆవుల భయంతో పంటలను కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

Read Also: Shocking Murder: రెంటర్స్ ని అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనర్.. ఆ తర్వాత ఏమైందంటే..

ఈ సమస్యను గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సౌమ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముందుంచి వివరించారు. అడవి ఆవుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్య పరిష్కారానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ప్రత్యేకంగా గడ్డి పెంచే ప్రాంతాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటికే డ్రోన్ల సహాయంతో సుమారు 2,000 అడవి ఆవులను గుర్తించినట్లు వెల్లడించారు. కృష్ణా నది ఒడ్డున సుమారు 25 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అడవి ఆవులను పట్టుకుని అడవుల్లో వదిలేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ బాధ్యతను పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అడవి ఆవుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తేనే రైతాంగం ఊపిరి పీల్చుకుంటుందని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Exit mobile version