Site icon NTV Telugu

CM Chandrababu: ఇరుసుమండ బ్లోఅవుట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష..

Cbn

Cbn

CM Chandrababu: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్‌ పై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ ప్రమాదంపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.. అయితే, బ్లోఅవుట్ ప్రాంతంలో గ్యాస్ లీక్‌ను అరికట్టడం, మంటలను నియంత్రించడం కోసం వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) విజయానంద్, హోంమంత్రి వంగలపూడి అనిత సీఎంకు వివరించారు. బ్లోఅవుట్‌ ప్రాంతంలో ఇంకా మంటలు ఆరలేదు, భారీగా గ్యాస్ ఎగజిమ్ముతూనే ఉంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి ఢిల్లీ నుంచి RCMT ఇన్‌చార్జ్ శ్రీహరి నేతృత్వంలో నిపుణుల బృందం కోనసీమకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలన, కట్టడి చర్యలు చేపడుతోంది.

Read Also: Mukesh Ambani: రిలయన్స్‌కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ

మంటలను ఆర్పేందుకు ONGC అధికారులు రెండు లారీల్లో కూలెంట్ ఆయిల్, ఇతర శీతలీకరణ ద్రవాలను తీసుకుని బ్లోఅవుట్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం నీరు, మడ్డు, మట్టి, బురద ఉపయోగించి మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, బ్లోఅవుట్‌ను పూర్తిగా ఆర్పే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు పునరావాస కేంద్రాల్లో సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయన్న దానిపైనా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితిని వివరించాలి, వారికి అండగా నిలవాలి అని స్పష్టం చేవారు.. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు జిల్లా యంత్రాంగంపైనే పూర్తి బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. అలాగే, బ్లోఅవుట్ వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం అందించే చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం బ్లోఅవుట్‌ ప్రాంతంలో నియంత్రణ చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నా, మంటలు, గ్యాస్ లీక్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వం, నిపుణుల బృందాలు నిరంతర పర్యవేక్షణతో కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి.

Exit mobile version