Site icon NTV Telugu

Podili Police – Trader Clash: వ్యాపారితో పోలీసుల ఘర్షణ.. సీఎం సీరియస్‌, చర్యలకు ఆదేశాలు

Cbn

Cbn

Podili Police – Trader Clash: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి పట్టణంలో అవినాష్ అనే వ్యాపారికి, పట్టణ ఎస్సై వేమనకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో షాప్ వద్ద లారీ నుంచి ఎరువులను అన్‌లోడ్‌ చేసే క్రమంలో వెంటనే లారీని అక్కడ నుంచి తొలగించాలని పోలీసులు కోరిన సందర్భంలో వివాదం రేగింది. తరువాత రోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రోడ్లపై రద్దీ కారణంగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో తమపై లాఠీతో దాడి చేశారని అవినాష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎస్ఐపై ఆరోపించారు.

Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు

దీనిపై వ్యాపార వర్గాలు తీవ్ర అభ్యంతరం వక్తం చేస్తూ ఆందోళన చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా ఎస్పీ ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపుతూ రెండు రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చారు. ఘర్షణకు కారణాలు, పోలీసుల చర్యలు, వ్యాపార వర్గాల ఆందోళనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వంగలపూడి అనితతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఘటనపై ఇప్పటికే మంత్రులు, అధికారులు స్పందించారని వివరించారు. సదరు పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ కు ముందుగా ఛార్జ్ మోమో ఇచ్చి వివరణ తీసుకున్నామని… ప్రాథమిక నివేదిక ఆధారంగా ఎస్ఐ వేమనను వీఆర్ కు పంపామని డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని… సాధారణ ప్రజల పట్ల వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. పొదిలి ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రజలు, వ్యాపారుల గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version