AP Cancer Atlas: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల క్యాన్సర్లను నియంత్రించేలా కార్యాచరణ చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశంలో క్యాన్సర్ వ్యాధిని నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాస్ ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహించి రూపొందించిన ఈ అట్లాస్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 2.9 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నమోదు చేసిన వివరాలతో ఈ అట్లాస్ ను రూపొందించారు. విజన్ స్టేట్‌మెంట్ ద్వారా 2030 నాటికి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్, మిషన్ స్టేట్‌మెంట్ ద్వారా ముందస్తు స్క్రీనింగ్ టెస్టులతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తగ్గించేలా అట్లాస్ ద్వారా కార్యాచరణ చేపట్టనున్నారు. హెల్త్ ఎడ్యుకేషన్, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ప్రివెన్షన్, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ వంటివి క్యాన్సర్ కేర్ స్ట్రాటజీలో వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పురుషులు, మహిళల నుంచి నమోదు చేసిన సమాచారం ఆధారంగా చికిత్సలు, సర్జికల్, రేడియేషన్, మెడికల్ ట్రీట్‌మెంట్ వారీగా అట్లాస్ లో వివరాలు పొందుపరిచారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో క్యాన్సర్ అట్లాస్ రూపకల్పన జరిగిందని స్పష్టం చేశారు..
