PM Modi 12 Years Governance: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనను విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ జాతీయ దినపత్రికలో ప్రత్యేక ఎడిటోరియల్ వ్యాసం రచించారు. ప్రధానిగా 4,399 రోజుల పాటు సేవలందించి భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సందర్భంగా ఈ వ్యాసాన్ని రాసినట్లు పేర్కొన్నారు. ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రధాని మోడీ చేపట్టిన పరిపాలన దేశ అభివృద్ధికి బలమైన పునాది వేసిందని చంద్రబాబు తన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. గత 12 ఏళ్లలో మోడీ అమలు చేసిన సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరింత శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయని వివరించారు.
ప్రపంచ దేశాల మధ్య భారతదేశ ప్రతిష్ఠను పెంచడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రస్తుత జియోపాలిటికల్ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాల విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల వెనుక మోడీ నాయకత్వం ముఖ్య కారణమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో మోడీ చేసిన కృషిని కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే దేశ ప్రతిష్ఠను పెంచడంలో ఆయన విజయం సాధించారని తెలిపారు.
భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అనుసరించిన వ్యూహాత్మక చర్యలను తన వ్యాసంలో విశ్లేషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, తయారీ రంగ ప్రోత్సాహం వంటి అంశాలు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలబెట్టాలనే లక్ష్యంతో మోడీ ముందుకు సాగుతున్నారని వివరించారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను ప్రజల జీవితాలకు మరింత చేరువ చేయడంతో పాటు పాలనలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమైందని తెలిపారు. ఇక, వ్యాసం ముగింపులో, ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాలను తప్పకుండా సాధిస్తుందనే విశ్వాసాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంస్కరణలు, సాంకేతిక పురోగతి మరియు ప్రపంచ స్థాయిలో భారత ప్రభావాన్ని మరింత పెంచే దిశగా నరేంద్ర మోడీ నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

