Site icon NTV Telugu

CM Chandrababu Serious on Ministers: మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి..

Cbn

Cbn

CM Chandrababu Serious on Ministers: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది.. పలు కీలక నిర్ణయాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేబినెట్‌.. అయితే, కేబినెట్‌ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు, పార్టీ వ్యవహారాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ తర్వాత పార్టీ కార్యాలయానికి తరచూ తానే రావాల్సి వస్తోందని, అయినా ప్రజల నుంచి వచ్చే వినతులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. నెలకు రెండు నుంచి మూడు సార్లు నేనే పార్టీ ఆఫీస్‌కు రావాల్సి వస్తోంది. అయినా వినతులు మాత్రం తగ్గడం లేదన్న సీఎం చంద్రబాబు.. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు మరింత చొరవ చూపాలని సూచించారు.

Read Also: Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

పార్టీ కోసం ఐదేళ్ల పాటు కష్టపడ్డ కార్యకర్తల పేర్ల జాబితాను అందించమని పలుమార్లు కోరినా.. ఇప్పటికీ జిల్లాల నుంచి పూర్తి వివరాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు అడిగినా.. పార్టీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డ వారి పేర్లు ఇవ్వడం లేదు. ఈ నిర్లక్ష్యం సరైన పద్ధతి కాదు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నిర్మాణం, పార్లమెంటు స్థాయి కమిటీల ఏర్పాటులోనూ మంత్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని పేర్కొన్న చంద్రబాబు.. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా నేనే పూర్తి చేశాను. దీన్ని బట్టి ఆయా జిల్లాల మంత్రుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.

ప్రజా సమస్యలు, పార్టీ వ్యవహారాలు, కమిటీల ఏర్పాట్లలోనూ తానే ముందుండి పూర్తి చేయాల్సి రావడం చూస్తుంటే.. జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రుల పనితీరు ఎలా ఉందో ప్రజలు, పార్టీ శ్రేణులు అంచనా వేసుకోవచ్చు అన్నారు సీఎం చంద్రబాబు.. మంత్రులు పార్టీ, ప్రజా సమస్యలపై సమానంగా దృష్టి పెట్టాలని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ శ్రేణుల వినతులు, కార్యకర్తల గుర్తింపు, ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, పార్టీ కోసం పని చేసిన వారికి న్యాయం చేయాలనే బాధ్యతను గుర్తుంచుకోవాలని సీఎం చంద్రబాబు హితవు పలికారు.

Exit mobile version