AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో, 226 రోజుల జైలు జీవితం అనంతరం ఆయన విడుదల కానున్నారు. ఇక, తమ నేత చెవిరెడ్డికి బెయిల్ రావడంతో తిరుపతి జిల్లావ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ హర్షం వ్యక్తం చేశారు. తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకుని “న్యాయం గెలిచింది” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని, చివరకు న్యాయమే గెలిచిందని వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత తిరుపతిలో భారీ స్వాగత కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 226 రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ లభించింది.. కాగా, అరెస్ట్ అయిన నాటి నుంచి తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. తనకు సంబంధం లేని కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోంది అంటూ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్న విషయం విదితమే..
