AP Rain Alert: ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈ పరిస్థితి ఉంది.. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..
ద్రోణి ప్రభావంతో రేపు (నవంబర్ 26) పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి (నవంబర్ 27) రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే చాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇక వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు
ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 45.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా అల్లంపాడులో 41.5 మి.మీ., గూడూరులో 32.7 మి.మీ., తిరుపతి జిల్లా వాకాడులో 32.5 మి.మీ., నెల్లూరు జిల్లా విడవలూరులో 32 మి.మీ. వర్షం కురిసింది. అలాగే తిరుపతి జిల్లా పెన్నేపల్లెలో 30 మి.మీ., నెల్లూరు జిల్లా మొలకలపుండ్లలో 28 మి.మీ., నెల్లూరులో 23.2 మి.మీ., భీమవరంలో 22.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ..

